A place where you need to follow for what happening in world cup

చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును అర్ధరాత్రి రాజమండ్రి జైలుకు తరలించారు. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించారు. అర్ధరాత్రి జైలుకు చేరుకున్న చంద్రబాబుకు అధికారులు ప్రత్యేక నెంబర్‌ కేటాయించారు. ఆయనకు 7691ను ఇచ్చారు. అంతకు ముందు సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆయన్ని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణ టైంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు నాయుడి కేసులో సీఐడీ వాదనలతోనే ఏసీబీ కోర్టు ఏకీభవించింది. చంద్రబాబుకు 2 వారాలపాటు రిమాండ్ విధించింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ హిమబిందు.. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు.

ఈ నెల 22 వరకు చంద్రబాబు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. అనంతరం ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య పోలీసు పహారాలో రాజమండ్రి తరలించారు. తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావించిన టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా నిరుత్సాహానికి లోనయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రాథమిక ఆధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేసినట్లు ఏపీ సిఐడి వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. గవర్నర్ అనుమతితో అరెస్ట్ చేయాలన్న వాదనలను సైతం కోర్టు కొట్టిపారేసింది. చంద్రబాబుకు రిమాండ్ అని తీర్పు రాగానే విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ఉదయం నుంచి దాదాపు ఏడున్నర గంటలకు పైగా ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.

రాజకీయ ఉద్దేశంతోనే అరెస్ట్ జరిగిందని, ఈ కేసులో 409 సెక్షన్‌ పెట్టడం సరికాదని వాదించారు. ఒకవేళ ఆ సెక్షన్‌ పెట్టాలంటే సరైన సాక్ష్యం చూపాలని ఏసీబీ కోర్టులో సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఒకానొక దశలో చంద్రబాబే తన కేసును వాదించుకున్నారు. న్యాయమూర్తి అనుమతితో వాదించే ప్రయత్నం చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని.. చట్టం, నిబంధనలు ఏమీ పట్టించుకోకుండా ఇష్టారీతిన అరెస్టులు చేస్తోందని వివరించారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో తనను నిర్భంధంలోకి తీసుకుని, ఉదయం 6 గంటలకు అరెస్ట్‌ చూపారని తెలిపారు.

రెండేళ్ల తర్వాత స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో పోలీసులు తనను 37వ నిందితునిగా చూపి అరెస్ట్‌ చేశారని చెప్పారు. ఈ స్కామ్‌తో తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు.  సీఐడీ తరఫున  ఈ కేసులో ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు చేస్తున్న వాదన తప్పని పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆరు గంటలకే ఆయన్ని అరెస్టు చేసినట్టు కోర్టుకు తెలిపారు. చట్ట ప్రకారమే అంతా జరిగిందన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో చంద్రబాబు 371 కోట్లు దోచుకున్నారని కోర్టుకు వివరించారు. ఇదే కేసులో గతంలో రిమాండ్ తిరస్కరించిందని… అప్పుడు హైకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేసిందని గుర్తు చేశారు.

Leave A Reply

Your email address will not be published.