మెదక్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో డిప్యూటేషన్ పై పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ) ఫహిం పాషా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ సంగారెడ్డి డీఎస్పీ ఏపీ.ఆనంద్ కుమార్ వివరాలు వెల్లడించారు. నర్సాపూర్ లో ఫిజియోథెరపి కేంద్రం ఏర్పాటు కోసం సతీష్ అనే వ్యక్తి ఆన్లైన్ లో దరఖాస్తుతోపాటు డీడీ కట్టాడు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రాసెస్ కోసం గత నెల రోజులుగా తిరుగుతున్నాడు.
సీహెచ్ఓ ఫహీం పాషాను కలవగా రూ.15 వేల లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వలేని బాధితులు సతీష్ ఏసీబీని ఆశ్రయించాడు. కేసు రీజిస్టర్ చేసి గురువారం ఉదయం నుండి కాపు కాసి సాయంత్రం బస్టాండ్ సమీపంలో సతీష్ నుండి ఫహీం పాషా లంచం తీసుకుంటుండగా రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అతన్ని కలెక్టరేట్ లోని డీఎంహెచ్ఓ ఆఫీస్ కు తీసుకెళ్లి విచారించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంతోపాటు ఫహీం పాషా ఇంటివద్ద సోదాలు నిర్వహించారు. డీఎంహెచ్ఓ డా.చందు నాయక్, సిబ్బండిని రప్పించారు. ఈ దాడిలో ఇన్స్పెక్టర్లు వెంకటరాజా గౌడ్, నగేష్, సిబ్బంది ఉన్నారు.