ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం ప్రకారం, రూ. 7 లక్షల వరకు ఆదాయంపై ఒక్క రూపాయి కూడా టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి, ఎక్కువ మంది టాక్స్ పేయర్లు ఈ ఆప్షన్‌ను ఇష్టపడుతున్నారు. బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 5.5 కోట్ల మందికి పైగా టాక్స్ పేయర్లు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. వార్షిక ఆదాయం రూ. 7 లక్షలు దాటని వాళ్లే వీళ్లలో ఎక్కువ మంది ఉన్నారు.
యూత్ టాక్స్‌పేయర్లలో ఎక్కువ పాపులారిటీ విశేషం ఏంమిటంటే, కొత్త పన్ను విధానాన్ని యువ పన్ను చెల్లింపుదార్లే ఎక్కువగా ఆదరిస్తున్నారని, వారి వల్లే ఎక్కువ ప్రాచుర్యం పొందిందని కూడా బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ చేసింది. న్యూ టాక్స్ రెజిమ్ ఎంచుకున్న 5.5 కోట్ల మందికి పైగా టాక్స్ పేయర్లలో ఎక్కువ సంఖ్యలో యువకులు ఉన్నారు. వాళ్ల జీతం రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఉంటుంది. కొత్త ఆదాయపు పన్ను విధానంలో రూ. 7 లక్షల ఆదాయం పన్ను రహితం కావడంతో పాటు, రూ. 27,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. మొత్తంగా చూస్తే, పన్ను మినహాయింపు పరిమితి 7.27 లక్షల వరకు ఉంటుంది.
2023 బడ్జెట్‌లో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కొత్త పన్ను విధానంలో కొన్ని పెద్ద మార్పులు ప్రకటించారు, పన్ను చెల్లింపుదార్లకు ఉపశమనం కల్పించారు. రూ. 7 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా మార్చారు. మరోవైపు, పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. అందువల్లే కొత్త పన్ను విధానాన్ని ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కచ్చితంగా ఎంత మంది కొత్త పన్ను విధానం ప్రకారం ITR ఫైల్ చేశారన్నది వచ్చే అసెస్‌మెంట్ సంవత్సరంలో (2024-25) మాత్రమే తెలుస్తుంది.
వివిధ ఆదాయ వర్గాల టాక్స్ పేయర్లు:
బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం, 2022-23 ఫైనాన్షియల్ ఇయర్‌లో 4.84 కోట్ల మంది ప్రజల యాన్యువల్ ఇన్‌కమ్ రూ.5 లక్షల వరకు ఉంది.
రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉన్న వారి సంఖ్య రూ. 1.12 కోట్లు.
రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారి సంఖ్య 47 లక్షలు.
రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారి సంఖ్య 20 లక్షలు.
రూ.50 లక్షల నుండి 1 కోటి మధ్య ఆదాయం ఉన్న వారి సంఖ్య 3.8 లక్షలు.
రూ.కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం గల టాక్స్ పేయర్ల సంఖ్య 2.6 లక్షలు మాత్రమే.