A place where you need to follow for what happening in world cup

అగ్రరాజ్యం అమెరికా లో కలకలం రేపుతోన్న కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌

న్యూ డిల్లీ ఆగష్టు 10:అగ్రరాజ్యం అమెరికా లో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇటీవలే పుట్టుకొచ్చిన ఈజీ. 5 (EG.5) వేరియంట్‌ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్‌ కేసులకు కారణమవుతోందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. ఈ కొత్త రకం వేరియంట్‌ ఒమిక్రాన్ జాతికి చెందిన ఎక్స్‌బీబీ 1.9.2 (XBB.1.9.2) రికాంబినెంట్ వైరస్‌ నుంచి పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్స్‌బీబీ 1.9.2‌ స్ట్రెయిన్‌తో పోలిస్తే ఈజీ.5లోని స్పైక్ ప్రోటీన్‌లో ఒక జన్యుమార్పు (మ్యూటేషన్) అదనంగా ఉందని గుర్తించినట్లు చెప్పారు. ఈ కొత్త మ్యూటేషన్ గతంలో ఇతర కరోనా వేరియంట్లలో కూడా గుర్తించామని వారు వెల్లడించారు.ఈజీ.5 కాకుండా ఎరిస్‌ (Eric) లేదా ఈజీ.5.1 (EG.5.1) అని పిలవబడే మరో కొత్త వేరియంట్‌ కూడా ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తోంది. కొవిడ్-19 (Covid-19)లో ఒమిక్రాన్ రకం నుంచి వచ్చిన ఈజీ.5.1 (EG.5.1) ప్రస్తుతం బ్రిటన్ (UK)ని వణికిస్తోంది.

ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం ఆ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో దీని వాటా 14.6 శాతంగా ఉందన్నారు. బ్రిటన్‌ ను భయపెట్టిస్తున్న కొత్త వేరియంట్‌ భారత్‌ లో కూడా విజృంభిస్తోంది. యూకేలో విస్తృతంగా వ్యాపిస్తున్న ఎరిస్‌ అని పిలిచే ఈ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.

ఇవీ లక్షణాలు :ఒమిక్రాన్‌ వేరియంట్‌ కొన్ని జన్యు మార్పులు సంతరించుకోవడం ద్వారా ఈ న్యూ వేరియంట్‌ ఉత్పన్నమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారిలో కనిపించిన వ్యాధి లక్షణాలే.. ఇంచుమించుగా ఈ కొత్త వేరియంట్‌ సంక్రమించిన వారిలో కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. సాధారణంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారిలో ముక్కు కారడం, తీవ్రమైన తల నొప్పి, గొంతు నొప్పి, తుమ్ములు, ఆయాసం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని, కొత్త వేరియంట్ ఎరిస్‌ సోకిన వారిలో ఈ లక్షణాలే కామన్‌గా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.