సనాతన ధర్మం డెంగీ, మలేరియా లాంటిదే అని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల దుమారం ఆగకముందే…మరో వివాదం రాజుకుంది. డిఎంకే పార్టీకి చెందిన నేత ఎ.రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం హెచ్ఐవి లాంటిదని, ఇదో సామాజిక వ్యాధి అని అన్నారు. హెచ్ఐవి కన్నా ప్రమాదకరమైన జబ్బు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజా కామెంట్స్‌పై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్పందించారు. ట్వీట్‌తో రాజాపై మండి పడ్డారు. “ఈ దేశంలో 80% మంది అనుసరించే ధర్మాన్ని, మతాన్ని కించపరుస్తున్నారు. డీఎమ్‌కే ఎంపీ రాజా హిందూమతాన్ని సామాజిక వ్యాధి అని అన్నారు. ఇది మత విద్వేష ప్రసంగం కాకపోతే మరేంటి..? ఇది కాంగ్రెస్ అసలు స్వరూపం. విపక్ష కూటమి స్వరూపమూ ఇదే. హిందూ మతాన్ని అనుసరించే వాళ్లను కించపరిచి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు”
కొడుకును సమర్ధించిన స్టాలిన్
సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల విషయంలో తన కొడుకునే సమర్థించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్. ఉదయనిధి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, వాటిని తప్పుదోవ పట్టించారని తేల్చి చెప్పారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా లేఖ రాశారు. ప్రధాని సహా మంత్రులందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడిన సమయంలో “నరమేధం” అనే పదమే అనలేదని వివరించారు.
ఇంగ్లీష్‌లో కానీ, తమిళ్‌లో కానీ ఆ పదాన్ని పలకలేదని అన్నారు. ఉదయనిధిపై కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. కొందరు బీజేపీ మద్దతుదారులు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని వేరే విధంగా అర్థం చేసుకున్నారు. కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నరమేధం సృష్టించాలని చూస్తున్నారంటూ విద్వేషాలు పెంచుతున్నారు. బీజేపీ చేతుల్లోని సోషల్ మీడియా ఈ ప్రచారం చేస్తోంది. కానీ…ఉదయనిధి తన స్పీచ్‌లో ఎక్కడా నరమేధం అనే పదమే వాడలేదు. అయినా…అదే పదేపదే ప్రచారం చేస్తున్నారని అన్నారు.