A place where you need to follow for what happening in world cup

హిట్ లిస్టులో 49 మంది…. ఇంటెలిజన్స్ రిపోర్ట్ పై కసరత్తులు

హైదరాబాద్, ఆగస్టు 8:బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 49 మంది డేంజర్ జోన్లో ఉన్నారు. వారికి టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని గులాబీ బాస్‌కు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇవ్వడంతో ఆ నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయంపై కసరత్తు ప్రారంభించారు. ఇతర పార్టీల్లో బలమైన నేతలపైనా ఆరా తీస్తున్నారు. డేంజర్ జోన్‌లో ఉన్న వారి గురించి ఆయా జిల్లాల మంత్రుల నుంచి ఫీడ్ బ్యాక్‌ను కేసీఆర్ తీసుకుంటున్నారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ రావాలని అధిష్టానం ప్రణాళికలు రూపొందిస్తుంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఎమ్మెల్యేల పని తీరుపైనా నిఘా పెట్టింది. ఇప్పటికే పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించింది. వారి పనితీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయంను ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సేకరిస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

సిట్టింగ్‌లకే వచ్చే ఎన్నికల్లో టికెట్ సైతం ఇస్తామని ప్రకటించినప్పటికీ.. వారిలో 49 మంది డేంజర్ జోన్‌లో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదికను ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే వారికి టికెట్ ఇస్తే ఈసారి ఓటమి ఖాయమని చెప్పినట్లు సమాచారం. ఫీల్డ్ సర్వే నిర్వహించిన తర్వాతనే రిపోర్టు ఇచ్చామని వర్గాలు తెలిపాయి. అయితే ఆ 49 అసెంబ్లీ నియోజకవర్గాలపై కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు.సిట్టింగ్‌లపై ప్రజా వ్యతిరేకత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లపై కేసీఆర్ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో ఏ పార్టీ బలంగా ఉందనే వివరాలతో పాటు బలమైన నేత ఎవరు..? ఆయన బయోడేటాను సైతం సేకరిస్తున్నట్లు సమాచారం. తాజాగా 49 నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందని వచ్చిన నివేదిక ప్రకారం ఆ నియోజకవర్గాల్లో ఎవరిని బరిలో దింపితే గెలుస్తామనే కసరత్తు సైతం ప్రారంభించారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వబోమని సంకేతాలను కేసీఆర్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే వాటితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో సైతం సిట్టింగ్‌లపై వ్యతిరేకత పెరుగుతోందని సర్వేల్లో వెల్లడవుతున్నది. మరోసారి విజయం సాధించి రాష్ట్రంలో హ్యాట్రిక్ సీఎం అవుదామనుకుంటున్న కేసీఆర్‌కు సర్వేలు షాక్ ఇస్తున్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. నేతలను సైతం అప్రమత్తం చేశారు. సర్వేల్లో ఎవరికి అనుకూలంగా వస్తే వారికే టికెట్ ఇస్తామని మరోవైపు మంత్రి కేటీఆర్ సైతం సిట్టింగ్లపై అసమ్మతి ఉన్న నియోజకవర్గాల నేతలతో భేటీ అవుతూ పేర్కొంటున్నారు.ఇదిలా ఉంటే జిల్లా ఇన్ చార్జీగా ఉన్న మంత్రులతో కేసీఆర్ ఆయా జిల్లాలోని నియోజకవర్గాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి జిల్లా పరిధిలోని సెగ్మెంట్లలో సిట్టింగ్‌పై ప్రజా వ్యతిరేకత ఉన్న నేతల వివరాలను తెలుసుకున్నారు. ఆ నియోజకవర్గంలో వ్యతిరేకత గల కారణాలను గులాబీ బాస్ అడిగి తెలుసుకుంటున్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకపోవడంలో వైఫల్యమా..? ప్రభుత్వ పథకాలను ఓన్ చేసుకోకపోవడమా? లేకుంటే నేత నిర్లక్ష్యమా? ఇతరాత్ర కారణాలను తెలుసుకుంటున్నారుఇతర పార్టీల్లో బలమైన నేత ఉంటే మన పార్టీలోకి తీసుకురావాలని, వారికి కండువా కప్పడంతో పాటు పదవుల ఆశ చూపాలని కూడా సూచించినట్లు తెలిసింది. విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని, అందుకు కావాల్సిన వనరులను సమకూర్చుతామని కూడా కేసీఆర్ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆదివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సైతం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తామని, 2018 ఎన్నికల్లో కంటే ఏడెనమిది సీట్లను ఎక్కువగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.అయితే అందుకు భిన్నంగా ఇంటెలిజెన్స్ రిపోర్టులు వస్తుండటంతో నేతలకు మరోసారి సీరియస్‌గా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మంత్రులపై సైతం మండిపడినట్లు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనప్పటికీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతమంది సిట్టింగ్‌లకు టికెట్ నో చెబుతారో అనేది హాట్ టాపిక్‌గా మారింది.

Leave A Reply

Your email address will not be published.