ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వేగంగా పెరుగుతుంది. శనివారం సాయంత్రానికి 53 అడుగులకు చేరుకుంది.కాళేశ్వరం, మేడిగడ్డ రిజర్వాయర్ నుండి 9 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు. ఇంద్రావతి, తాలిపేరు, జంపన్నవాగు, పెద్దవాగు, తదితర ప్రాంతాల నుండి వరద నీరు భారీగా చేరుకోవడం వలన భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతుంది. దీనితో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసారు. వరద ప్రభావం మరి కొంత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. గోదావరి 53 అడుగులకు చేరుకోగానే ఎక్కడికక్కడ ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహిస్తుంది.
దీని కారణంగా అధికారులు రాకపోకలను పూర్తిగా నిలిపివేసారు. ఎటపాక, తూరుబాక గ్రామాల వద్ద వరద ప్రవాహం వేగంగా ఉండటం వలన ఆ రహదారులు నీటమునిగాయి. రోడ్లపై వేగంగా ప్రవహిస్తుంది. అధికారులు దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు, మండలాలకు రాకపోకు నిలిపివేసారు. ఆర్టీసి బస్సులను కూడ నిలిపివేసారు. ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ రహదారులపై బారికేడ్స్‌ను ఏర్పాటు చేసి వాహనాలు తిరుగకుండా ఆపివేసారు. అలాగే కూనవరం, విఆర్‌పురం, చింతూరు, మోతుగూడెం ప్రాంతాలకు వెళ్ళే రహదారులు కూడ వరద ముంచెత్తింది. ఈ మండలాలకు రాకపోకలు పూర్తిగా నిరోధించారు. గుండాల, నెల్లిపాక ప్రాంతంలో వరద నీరు భారీగా చేరుకోవడంతో రాకపోకలు నిలిపివేసారు. ప్రధానంగా భద్రాచలం పట్టణంలోని కొత్తకాలనీ, ఏఎంసీ కాలనీ, రెవెన్యూ కాలనీలకు వరద ప్రభావం తప్పలేదు.
ప్రతీ ఏటా ఈ కాలనీలకు వరదల సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే కొత్తకాలనీలో ఉన్న ఇండ్లలోకి భారీగా వరద నీరు చేరుకుంది. హుటాహుటిన అధికారులు బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఆయా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలని సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే నన్నపనేని స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ మరియు ఇతర హాస్టల్స్‌లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసారు. వరద తాకిడికి గురైన కాలనీ ప్రజలను మధ్యాహ్నం నుండే పునారావస కేంద్రాలకు తరలించే పనిలో ఉన్నారు. అలాగే సారపాక వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో బూర్గంపాడు మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్రా ప్రాంతమైన కుక్కునూరు, ఉప్పేర ప్రాంతాలలో రోడ్లపై నీరు ఉండటం వలన బూర్గంపాడుకు కుక్కునూరుకు రాకపోకలు నిలిచిపోయాయి.
అలాగే బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామం వద్ద రోడ్డుపై వరద నీరు ప్రవహించటంతో అటుగా వెళ్ళే వాహనాలను నిలిపివేసారు. వరద ప్రభావం ప్రాంతాలలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు. అధికారులు సకాలంలో స్పందించకపోవడం వలన స్లూయీస్ నుండి గోదావరి వరద కాలనీల్లోకి ప్రవేశించింది. మోటార్ల సహాయంతో నీటిని మళ్ళీ గోదావరిలోకి పంపిస్తున్నప్పటికి వద వేగం ఎక్కువగా ఉండటం వలన కాలనీల్లోకి భారీగా వరదనీరు చేరుకుంటుంది. విస్తా కాంప్లెక్స్ వద్ద వరద ప్రభావం కొనసాగుతూనే ఉంది. స్లూయీస్ వద్ద వరద నీటిని గోదావరి లోకి పంపిస్తున్నారు. ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి మరింత పెరిగే అవకాశం ఉంది.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి తుమ్మల
గోదావరి వరద పెరుగుతున్న దృష్ట్యా అధికారులు అందరు అప్రమత్తంగా ఉంటూ లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. శనివారం సాయంత్రం నూతనంగా నిర్మిస్తున్న కరకట్ట, గోదావరి పరివాహక ప్రాంతంలో కరకట్టను పరిశీలించారు. వరద నీరు కాలనీల్లోకి రావడం పట్ల అధికారులపై మండిపడ్డారు. స్లూయీస్ మరమత్తులు చేయలేదని ఇరిగేషన్ అధికారులను మందిలించినట్లు తెలుస్తుంది. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.