A place where you need to follow for what happening in world cup

సీతమ్మసాగర్ కు ‘హస్తం’ అడ్డు..

  • జీవధారపై స్వార్థ పూరిత కుట్రలు
  • లక్షలాది మంది ప్రజలకు తాగు సాగు నీరందకుండా కుతంత్రం
  • ఎన్జీటీ స్టే తో నిలిచి పోయిన పనులు
  • వలస నేతపై ఆదివాసీల ఆగ్రహం

కాలం మారుతున్నా కాంగ్రెస్ పార్టీ నేతలుమాత్రం మారరు. అవే కుట్రలు..కుతంత్రాలు. చివరికి కోట్లాది మంది ప్రజలకు తాగు, సాగు నీరందించే నీటిపారుదల ప్రాజెక్టులను  కూడా తమ స్వార్థ రాజకీయ క్రీడా విన్యాసానికి వేదికగా ఎంచుకుంటారు. నీళ్ళు, నిధులు, నియామకాలే నినాదంగా జరిగిన పోరాటానికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రం ఏర్పడి దశాబ్థం కావచ్చినా ఆ పార్టీ నేతల వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులపై పెద్ద సంఖ్యలో కేసులు వేసి వాటిని ఆపడానికి విఫలయత్నం చేశారు.   వెనుక బడిన గిరిజన ప్రాంతానికి తాగు, సాగునీరందించే సీతమ్మసాగర్ ప్రాజెక్టును కూడా వీరు విడిచి పెట్టలేదు. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదివాసీ ఎమ్మెల్యే అనుచరులు ఇటీవల ఎన్జీటీలో కేసు వేసి స్టే తెచ్చారు. దీనితో పనులు నిలిచిపోయాయి. ఈ పిటిషన్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే నిజ స్వరూపం బయట పడింది. అంతటితో ఆగకుండా పనులు కొనసాగిస్తే ప్రాజెక్టును పగుల కొడతామంటూ కొందరు కాంగ్రెస్ నేతలు చేస్తున్న హెచ్చరికలు కూడా చర్చనీయాంశంగా మారాయి. 

పూర్వపు వరంగల్ జిల్లాకు చెందిన ఒక ఆదివాసీ నేతకు మాజీ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి అనుచరుడిగా పేరుంది. 2018 ఎన్నికల్లో సొంత జిల్లాలో టికెట్ నిరాకరించడంతో చివరి క్షణంలో ఖమ్మం జిల్లాకు వలస వచ్చారు. ఆయన పోటీ చేసిన గిరిజన నియోజక వర్గంలో కమ్యూనిస్టులు బలహీన పడడం, టీఆర్ఎస్ పార్టీకి బలం లేక పోవడం వంటి కారణాలతో కాంగ్రెస్ గెలిచింది. గెలిచిన మరుక్షణం నుంచి నేత దృష్టి అంతా డబ్బు సంపాదపైనే పడింది. గెలిచిన నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా సొంత జిల్లా పైనే దృష్టి సారించారు. కాంట్రాక్టు పనులు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇసుక రీచ్ లు, చివరికి దళిత బంధు పథకంలోనూ ఎమ్మెల్యే అనుచరులు హస్త లాఘవం చూపించి భారీగా వసూళ్ళకు పాల్పడ్డారు. ఇటీవల వీరి దృష్టి సీతమ్మసాగర్ బ్యారేజీ, గోదావరి కరకట్టలపైనా పడింది. కాంట్రాక్టర్ల వద్ద నుంచి దాదాపు రూ. 20 కోట్లు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా ముఖ్యమంత్రికి కూడా చేరింది. సీతమ్మసాగర్ పనులు చేస్తున్న కంపెనీ అంతర్జాతీయ కంపెనీ కావడంతో కాంగ్రెస్ నేతల డిమాండ్ ను పట్టించుకోలేదని తెలిసింది. దీనితో ఎన్జీటీలో పిటిషన్ వేయించారు. 

పూర్తి కావస్తున్న పనులు..

సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి నదిపై నిర్మిస్తున్న బ్యారేజీ పనులు మూడు వంతులకు పైగా పూర్తయ్యాయి. కరకట్టల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. బ్యారేజీ పూర్తయితే  నిల్వ ఉండే బ్యాక్ వాటర్ తో పాటూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో వస్తున్నభారీ వరదలను తట్టుకునే విధంగా ఎడమ, కుడి వైపున నిర్మిస్తున్న కరకట్టల పనులను కూడా నిలిపి వేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కరకట్టల పనులు నిలిచి పోతే వరద నీరు గ్రామాలపై పడి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. 

9.36 లక్షల ఎకరాలకు సాగునీరు…

సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గిరిజన జిల్లాగా పేరుగాంచిన పూర్వపు ఖమ్మం జిల్లాతో పాటు ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని 9.36 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. లక్షలాది మందికి తాగునీరందుతుంది. నిజానికి ఈ ప్రాజెక్టును రూపకల్పన కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. కాంగ్రెస్ హయాంలో మంజూరు చేసిన ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ఎత్తిపోతల పథకాలను కలిపి సమగ్ర ప్రాజెక్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైన్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో పూర్వపు ఖమ్మం జిల్లా నేతలకు ఇది కల్పతరువుగా మారింది. పనులు మాత్రం సాగలేదు. సీతారామ ఎత్తిపోతల పథకంగా రీడిజైన్ చేసిన తర్వాత వేగంగా పనులు జరిగాయి. కాల్వలు, పంప్ హౌస్ ల పనులు దాదాపు పూర్తయ్యాయి. గోదావరి నదిపై 150 సంవత్సరాల క్రితం నిర్మించిన కాటన్ ఆనకట్ట వద్ద నీటి నిల్వ సరిపోదని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నదిపై సీతమ్మసాగర్ పేరుతో  ఒక బ్యారేజీని మంజూరు చేశారు. 36.57 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో దీనిని ప్రతిపాదించారు. బ్యారేజీతో పాటు కరకట్టలకు సవరించిన అంచనాల ప్రకారం మరో రూ. 6,000 కోట్లు అదనపు వ్యయం అవుతుంది. సీతమ్మసాగర్ తో కలిపి సీతారామ సాగర్ అంచనా వ్యయం దాదాపు రూ. 18,000 కోట్లకు పెరిగింది. 68 మీటర్ల ఎత్తుతో65 గేట్లతో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం రూ. 10,000 కోట్ల వరకూ ఖర్చు చేసింది. ఈ దశలో చిన్న చిన్న సాంకేతిక కారణాలతో ప్రాజెక్టును ఆపాలంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాల వెనుక కారణాలను జిల్లా వాసులు ఊహించగలరు.

 

కాంగ్రెస్ పాపమే తెలంగాణకు శాపం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా దేశాన్ని ఐదున్న దశాబ్థాల పాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతానికి చేసిన అన్యాయం ఇంతా అంతా కాదు. నదీ జలాల కేటాయింపు, ప్రాజెక్టుల నిర్మాణంలో అడుగడుగునా ఈ ప్రాంతం వివక్షకు గురైంది. 79 శాతం గోదావరి బేసిన్ లోనూ, 68.5 శాతం కృష్టా బేసిన్ లోనూ ఉన్న తెలంగాణ ప్రాంతానికి తాగునీరు. సాగునీరు అందక విలవిల్లాడింది. ప్రతి ఏటా వరదలతో 3,000 టీఎంసీలకు పైగా గోదావరి నీరు సముద్రంలో కలుస్తుంటే తెలంగాణ ప్రాంతంలో నిర్మిస్తున్న బ్యారేజీలపై ఏపీ ప్రభుత్వం విషం చిమ్ముతోంది. గోదావరి బోర్డుకు, కేంద్రం జలశక్తి శాఖకు ఫిర్యాదులు చేయడం ద్వారా ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నది. మరో వైపు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో తెలంగాణ భూభాగంలోని 100 కు పైగా గిరిజన గ్రామాలు మునిగిపోతుంటే కాంగ్రెస్ నేతలు ఏపీ ప్రభుత్వంపై యుద్ధం చేయకుండా ఇక్కడి నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపడానికి కేసులు వేయడం విశేషం. గోదావరి, కృష్ణా నదుల నీటిలో న్యాయమైన వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ కుటిల రాజకీయాలతో కాలం గడుపుతున్నది.

కాంగ్రెస్ వస్తే రద్దు చేస్తారా?

పూర్వపు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని 9.36 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందించే సీతమ్మ సాగర్ బ్యారేజీపై కేసులు వేయిస్తున్న కాంగ్రెస్ నేతలు ప్రజలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లోకి వస్తే ఈ ప్రాజెక్టును రద్దు చేస్తారా లేక కేసులు ఉపసంహరించుకుని ప్రజలకు క్షమాపణ చెప్తారో తేల్చుకోవాల్సి ఉంది.  

  కొండూరి రమేష్ బాబు.., సీనియర్ జర్నలిస్టు, 8332995398

Leave A Reply

Your email address will not be published.