A place where you need to follow for what happening in world cup

పొంగులేటి నోట అమరుల మాట..!

  • జగన్ తో అంటకాగినప్పుడు గుర్తు రాలేదా?
  • మానుకోట రాళ్ళనడిగితే చెప్పేవి కదా..
  • విద్యార్థుల ఆత్మ బలిదానాలు ఇప్పుడు గుర్తొచ్చాయా?
  • నీళ్ళు దోచుకు పోతున్న ఏపీతో దోస్తానా
  • నీళ్ళు నిధులు నియామకాల ముచ్చటెందుకు
  • ఉద్యమంలో లేని వ్యక్తికి ట్యాగ్ లైన్ అవసరమా..
  • రాజకీయ చౌరస్తాలో ఆయన రూటెటు?

రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి చుట్టూ అనేక ప్రశ్నలు..పలు సందేహాలు.. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టిపెడుతున్న పొంగులేటి ఇప్పుడు రాజకీయ చౌరస్తాలో ఉన్నారు. ఆయన ఏ పార్టీలో చేరతారో చుట్టూ తిరుగుతున్న అభిమానులు కూడా చెప్పలేరు. తాజాగా కొత్త పార్టీ పెడతారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. సాంకేతికంగా చూస్తే పొంగులేటి ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. ఈ గందరగోళానికి ఆయన ఎప్పడు ముగింపు చెప్తారో ఎవరికీ అంతుపట్టడం లేదు. మరో వైపు బీఆర్ఎస్ పైనా, సీఎం పైనా విమర్శలు గుప్పిస్తున్నారు.  

ఫిరాయింపు ముద్ర…

ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి 2014 లో వైసీపీ ఎంపీగా విజయం సాధించిన పొంగులేటి మరో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను గెలిపించుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ అంతగా లేని ఖమ్మం జిల్లాలోని గిరిజన నియోజకవర్గాల్లో రాజశేఖర రెడ్డి పట్ల అభిమానం మెండుగా ఉండడం ఈ విజయానికి మొదటి కారణమైతే జిల్లాలో బలంగా ఉన్న సీపీఎంతో కుదిరిన అవగాహన కూడా మరొక కారణమని చెప్పవచ్చు. ఈ క్రెడిట్ అంతా తన వ్యక్తిగత ఖాతాలో వేసుకున్న పొంగులేటి తన చుట్టూ జిల్లా రాజకీయాలు తిరుగుతున్నాయనే హైప్ ను సృష్టించుకున్నారు. వైసీపీని విడిచి పెట్టి అధికార టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి ఆయన గ్లామర్ తగ్గుతూ వచ్చింది. 

2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పొంగులేటికి ఇవ్వకుండా నామా నాగేశ్వరరావుకు ఇవ్వడంతోనే కటింగ్ మొదలయ్యిందని చెప్పవచ్చు. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి వర్గం వెన్నుపోటు పొడిచిందని పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించడంతో కేసీఆర్ వద్ద పొంగులేటి ప్రాపకం తగ్గింది. లోక్ సభ టికెట్ నిరాకరించిన తర్వాత కూడా పొంగులేటి ఆ పార్టీని వీడకుండా వేచి ఉండే ధోరణి అవలంబించారు. రాజ్యసభకు పంపుతారని కొంతకాలం, కనీసం ఎమ్మెల్సీ పదవైనా దక్కక పోతుందా అని మరికొంత కాలం నిరీక్షించారు. 

ఆయన రాజకీయ గురువైన తుమ్మలతో పాటు తనను కూడా కేసీఆర్ పక్కన పెట్టి పువ్వాడ అజయ్ కు మంత్రి పదవి కట్టబెట్టినప్పుడు కూడా పొంగులేటి తిరుగుబాటు చేయలేదు. కేవలం మీడియా లీకులకే సరిపెట్టారు. ఏ పదవీ దక్కక  పోవడంతో పాటూ బీఆర్ఎస్ పార్టీలో ఇంక తనకు భవిష్యత్ లేదని తెలిసిపోయిన తర్వాత కూడా ఆ పార్టీని వీడలేదు. ఆయన బీజేపీలోకి వెళ్తున్నారంటూ కొంత కాలం, కాంగ్రెస్ లేదా షర్మిల పార్టీలోకి వెళ్తున్నారంటూ ఇటీవల చర్చ జరిగింది. 

పొంగులేటి బాథ లోకం బాథ..

బీఆర్ఎస్ పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని పొంగులేటికి అర్థమయి చాలా కాలమే అయింది. మరో వైపు కాంట్రాక్టు పనులు కూడా దక్కకుండా కేసీఆర్ చెక్ పెట్టడంతో ఆర్థికంగా ఆయనకు పెద్ద దెబ్బే తగిలింది. తన కలిగిన బాథను లోకం బాథగా మలుచుకునేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. అనేక  అవమానాలు జరిగిన తర్వాత కూడా పార్టీని వీడక పోవడం ఆయన అనుయాయులను కూడా అయోమయానికి గురిచేసింది. ఇప్పడు తనకు కడుపు నొప్పి వస్తే ఖమ్మం జిల్లా సహా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు కూడా కడుపు నొప్పి వచ్చినట్టు ఆయన ప్రవర్తించడం విశేషం. 

తమ పార్టీలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కోరినా  బ్లాంక్ చెక్ ల మాదిరిగా జిల్లాలోని అన్ని నియోజక వర్గాలను తనకు అప్పగించాలని కోరడంతో  ఆ పార్టీల నేతలు ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. అయితే ఆయన ఆచి తూచి అడుగులు వేస్తున్నారంటూ అభిమానులు ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండానే ఆ పార్టీపైన, నాయకుడిపైనా విమర్శలు గుప్పించడం రాజకీయ పరిశీలకులను కూడా విస్మయానికి గురి చేస్తున్నది. పార్టీ నుంచి సస్పెండ్ లేదా తొలగిస్తే సానుభూతి పెరుగుతుందనే ఆలోచన కూడా పొంగులేటికి ఉందని మరికొందరు భావిస్తున్నారు. రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవని, 1+1=2 కాదనే విషయాలు పొంగులేటి అర్థం కావని ఎవరూ అనుకోవడం లేదు. 

పొంగులేటి నోట తెలంగాణ పాట…

ఆదివారం పొంగులేటి పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగించిన తీరు చూస్తే ఆయనేదో కరుడు గట్టిన తెలంగాణ వాది అని ఎవరైన అనుకునే ప్రమాదం ఉంది. నిజానికి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సమయంలో ఆయన ఎన్నడూ ఉద్యమంలో పాల్గొన లేదు. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం తెలంగాణ వ్యతిరేకి తుమ్మల పంచన చేరి కాంట్రాక్టు పనులను చేసుకున్నారు. ఆ తర్వాత మరో తెలంగాణ వ్యతిరేకి రాజశేఖరరెడ్డి అభిమానిగా మారి కాంట్రాక్టు పనులనే చేసుకున్నారు. శ్రీకాంతా చారి, యాదయ్య, యాదిరెడ్డి, కిష్టయ్య వంటి వారు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు కానీ, ఉస్మానియా విద్యార్థులపై లాఠీలు విరిగి బాష్ప వాయువు గోళాలు ప్రయోగించినప్పుడు కానీ పొంగులేటి ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు.

రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్ పంచన చేరాడు. తెలంగాణ ఉద్యమ కారులు వ్యతిరేకించినా రాయలసీమ గూండాలతో జగన్ మానుకోట పర్యటనకు రావడం, కొండా మురళి రివాల్వర్ తో వారిపైకి కాల్పులు జరపడం పొంగులేటికి గుర్తుండక పోవచ్చు. కానీ ఆ గాయం నేటికీ మానలేదని తెలుసుకోవాలి. కేసీఆర్ తెలంగాణలో కాంట్రాక్టు పనులు ఇవ్వక పోతే మళ్ళీ జగన్ పంచన చేరి ఏపీలో పనులు చేసుకుంటున్న పొంగులేటి ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిపోయిందంటూ కన్నీరు కార్చడం తెలంగాణ వాదులకే కాకుండా సామాన్య జనానికి కూడా మింగుడు పడడం లేదు. నదీ జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా రాకుండా అడ్డుపడుతున్న జగన్ వెంట నడుస్తున్న పొంగులేటి ఇప్పడు నీళ్ళు, నిధులు, నియామకాలంటూ తెలంగాణ వాదుల ట్యాగ్ లైన్ అందుకోవడం కూడా అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇక అమర వీరుల ఆకాంక్షల గురించి ఆయన మాట్లాడటం మరొక వింతగా అభివర్ణించవచ్చు..తెలంగాణ వాదం అంతగా లేని పూర్వపు ఖమ్మం జిల్లాలో పొంగులేటికి తెలంగాణ వాదం పెద్దగా వర్కవుట్ కాక పోవచ్చునేమో.

కొండూరి రమేష్ బాబు

సీనియర్ జర్నలిస్టు, 

తెలంగాణ జర్నలిస్టుల ఫోరం

ఖమ్మం జిల్లా పూర్వ అధ్యక్షుడు.

Leave A Reply

Your email address will not be published.