A place where you need to follow for what happening in world cup

గోదావరిలో కాలకూట విషం..

  • ఐటీసీ పారిశ్రామిక వ్యర్థాలతో జీవనది విల విల
  • భద్రాచలం పుణ్యక్షేత్రం వద్ద రసాయనాల కంపు
  • తీర ప్రాంత వాసులకు తీరని వేదన 
  • పశు పక్షాదులకు తప్పని ముప్పు
  • నాలుగున్నర దశాబ్థాల చీకటి చరిత్ర

జీవనది గోదావరి రాముని పాదాలను తాకే చోట గరళాన్ని మింగుతున్నది. భద్రాచలం ఆవలి తీరంలోని ఐటీసీ పేపర్ మిల్లు వదులుతున్న రసాయనిక వ్యర్థ పదార్థాలతో కాలుష్య కాసారంగా మారిపోయింది. నాలుగున్నర దశాబ్థాల ఈ చీకటి చరిత్రను తిరగరాసే శక్తి ప్రభుత్వాలకు, న్యాయస్థానాలకు కూడా లేక పోవడంతో కాలకూట విషాన్ని ప్రజలు మౌనంగానే భరిస్తున్నారు. తీర ప్రాంతంలోని భద్రాచలం, సారపాక పట్టణాలతో పాటు దాదాపు 40 గ్రామాల ప్రజలు కలుషిత నీటి బారిన పడుతున్నారు. మనుషులకే దిక్కులేని చోట పశు పక్షాదుల గురించి, చేపలు తదితర జలచరాల గురించి ఆలోచించే వారు అరుదనే చెప్పవచ్చు.

పేపర్, బోర్డు తయారీ రంగంలో పేరుగాంచిన ఐటీసీ పేపర్ మిల్లు వందల కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తున్నది. మరో వైపు గాలి, నీరు కాలుష్యంతో ఈ ప్రాంత వాసులకు పీడకలగా మారిపోయింది. కాలుష్యంతో మత్స్య సంపద అంతరించి పోతుండగా అరుదైన పక్షులు ఈ నీటిని తాగి నేల కొరుగుతున్నాయి. పశువులు, మేకలు రోగాల బారిన పడి మరణిస్తున్నాయి. తీర ప్రాంతంలో నివసించే దాదాపు రెండు లక్షల మంది ఊపిరి తిత్తుల రోగాలు, కేన్సర్, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. మహిళలకు గర్భ కోశ వ్యాధులు పెద్ద సంఖ్యలో నమోదు కావడానికి కూడా ఐటీసీ కాలుష్యమే కారణమని వైద్యులు అంటున్నారు. 

అయితే ఓకే…

కాలుష్య నియంత్రణ చట్టాలను అమలు చేయాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఐటీసీ యాజమాన్యం ఇచ్చే ముడుపులు తీసుకుని వారి సేవలో తరించిపోతున్నారు. పేరుకు నమూనాలు సేకరిస్తూ అప్పడప్పుడు జరిమానాలు విధిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. వాతావరణ, జల కాలుష్యాలను తగ్గించే ట్రీట్ మెంట్ ప్లాంట్లను ఐటీసీ యాజమాన్యమే పనిచేయనీయకుండా కాలుష్యాన్ని వెదజల్లుతున్నా, అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను గోదావరిలో వదులుతున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కానీ, జిల్లా యంత్రాంగం కానీ నోరు మెదపదు. 

కలుషిత జలాల్ని గోదావరిలో కలపడానికి ప్రభుత్వమే అనుమతించిందంటూ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఎటువంటి శుద్థి చేయకుండా రసాయన వ్యర్థాల్ని జీవనదిలోకి వదలడం పర్యావరణ చట్టాల ప్రకారం నేరం. 1986 పర్యావరణ చట్టం, 2006 పర్యావరణ ప్రభావ మదింపు నోటిఫికేషన్ ప్రకారం నదుల్లో పారిశ్రామిక వ్యర్థాల్ని వదలడాన్ని పూర్తిగా నిషేధించారు. 

మొసళ్ళు మృతి చెందినా పట్టించుకోరా..

ఐటీసీ రసాయనిక వ్యర్థ పదార్థాలతో ఏర్పడిన మడుగులో పెద్ద సంఖ్యలో మొసళ్ళు జీవిస్తున్నాయి. నీటి కాలుష్యంతో అవి మృతి చెందుతున్నాయి. వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు వాగుల వద్ద ఉంటున్న మొసళ్ళు గోదావరి తగ్గిన తర్వాత రెడ్డిపాలెం సమీపంలోని ఐటీసీ మడుగుకు చేరుకుంటున్నాయి. ఎటువెళ్ళడానికి దారి లేక పోవడంతో మృతి చెందుతున్నాయి. ఇటీవల వరదలు వచ్చినప్పుడు వరద నీటికి కొట్టుకుని వచ్చిన కొన్ని మొసలి పిల్లలను అటవీ శాఖ వారు పట్టుకుని కిన్నెరసాని డ్యాం వద్ద వదలి పెట్టారు. మరి కొన్ని మొసలి పిల్లలు కలుషిత జలాల్లోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల కలుషిత నీటితో ఐదు పెద్ద మొసళ్ళు కూడా మృతి చెందడం సంచలనం కలిగించింది. ఐటీసీ కాలుష్య జలాల్ని పరిశీలించడానికి బుధవారం ఆ ప్రాంతానికి వెళ్ళిన ‘రేలా’ ప్రతినిధికి నీటిలో మృతి చెందిన పెద్ద మొసలి కనిపించింది. వెంటనే అటవీ శాఖాధికారులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు ప్రారంభించారు.

నీటి నమూనాలను సేకరించి పరీక్షకు పంపించారు. వెటర్నరీ డాక్టర్ ద్వారా పోస్టుమార్టమ్ చేయించారు. మొసలి శరీర భాగాలను సీసీఎంబీకి పంపించారు. సరీనృపాల జాతిలో మొసలిని అంతరిస్తున్న జీవిగా గుర్తించి 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని మొదటి షెడ్యూల్లో చేర్చారు. మొసళ్ళ మృతికి కారణమైన ఐటీసీ యాజమాన్యంపై ఈ చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్పిందిగా అటవీ శాఖ ఉన్నతాధికారులను ‘రేలా’స్వచ్ఛంద సంస్థ కోరింది. 

                                                                                                                     కొండూరి రమేష్ బాబు..

Leave A Reply

Your email address will not be published.