- ఏజెన్సీలో మద్యం అమ్మకాల కోసం గ్రామసభల ‘కోరం’ నిబంధనల్లో మార్పు
- తక్కువ మంది హాజరైనా తీర్మానం చెల్లుబాటు
- చీకటి జీవో 54 విడుదల చేసి రెండేండ్లు
- ఆదివాసీల స్వయం నిర్ణయాధికారానికి తూట్లు
ఆదివాసీల స్వయం నిర్ణయాధికారం కోసం అమల్లోకి వచ్చిన షెడ్యూల్డు ప్రాంతాలకు పంచాయితీరాజ్ విస్తరణ (పీసా) చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా తూట్లు పొడుస్తున్నది. మా గ్రామంలో మా పాలన పేరుతో ఆదివాసీలు చేసిన దేశ వ్యాప్త ఆందోళనల నేపథ్యంలో పార్లమెంట్ చేసిన ఈ చట్టం స్ఫూర్తిని దెబ్బతీస్తున్నది. ఏజెన్సీ ప్రాంతంలో మద్యం అమ్మకాల కోసం ఏకంగా ‘కోరం’ నిబంధనలను మార్చి వేస్తూ విడుదల చేసిన చీకటి జీవో 54 కి రెండేండ్లు నిండాయి. ఈ జీవో విడుదలైన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచడంతో అటు ఆదివాసీలకు కానీ, ఇటు అధికార యంత్రాంగానికి కానీ దీని గురించి తెలియక పోవడం విశేషం.
పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా స్థానిక సంస్థలకు అధికారాలను కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం 73, 74 రాజ్యాంగ సవరణలను చేసింది. వీటిలో భాగంగా భూరియా కమిటీ సిఫారసుల మేరకు 1996 లో పార్లమెంట్లో 40 వ చట్టం ద్వారా ‘పీసా’ అమల్లోకి తెచ్చింది. ఈ చట్టాన్ని రాష్ర్టంలో అమలు చేయడానికి 1994 పంచాయితీరాజ్ చట్టంలో మార్పులు చేశారు. 1998 లో చట్టం 7 ద్వారా రాష్ర్ట చట్టంలో కేంద్ర చట్టాన్ని పొందు పరచారు. చట్టం అమలు చేయడానికి విధివిధానాలను 2011 మార్చి 24 న జీవో నంబర్ 66 ను రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇదే జీవో ప్రకారం ‘పీసా’ గ్రామసభలను నిర్వహిస్తూ వచ్చారు.
మద్యం దుకాణాల కోసం రహస్య జీవో…
ఏజెన్సీ ప్రాంతంలో మద్యం దుకాణాలు ప్రారంభించడానికి ‘పీసా’ చట్టం ప్రకారం గ్రామసభల అనుమతి అవసరం. గతంలో విడుదల చేసిన జీవో నంబర్ 66 ప్రకారం ఏజెన్సీ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించడానికి మొత్తం ఓటర్లలో మూడవ వంతు మంది హాజరైతేనే కోరం పూర్తయినట్టు. ఏ 4 మద్యం దుకాణాల కోసం నిర్వహిస్తున్న గ్రామసభలకు ఆదివాసీలు తక్కువ సంఖ్యలో హాజరు కావడంతో అవి తరచుగా వాయిదా పడతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి ఇది గండి కొడుతోంది. దీనితో ఆదివాసీల విస్తృతాభిప్రాయానికి గండి కొడుతూ కేవలం కొద్ది మందితో గ్రామసభ ఆమోదం పొందేలా కోరం నిబంధనలను మార్చి వేశారు. ఈ మేరకు 2019 అక్టోబర్ 10 న పంచాయతీరాజ్ శాఖ జీవో 54 జారీ చేసింది. దీని ప్రకారం 500 మంది ఆదివాసీ ఓటర్లుండే గ్రామంలో కేవలం 50 మంది (10 శాతం) గ్రామసభకు హాజరైతే కోరం సరిపోతుంది. 501 నుంచి 1,000 మంది ఉంటే 75 మంది, 1,001 నుంచి 3,000 మంది ఉంటే 150 మంది, 3,001 నుంచి 5,000 మందికి 200, 5,001 నుంచి 10,000 వరకూ 300 మంది, 10 వేలకు పైగా ఓటర్లు ఉంటే 400 మంది హాజరైతే కోరం పూర్తయినట్టే. పీసా చట్టం స్ఫూర్తిని దెబ్బతీసే మరో అంశం కూడా ఈ జీవోలో పొందు పరచారు. కోరం లేక గ్రామసభ వాయిదా పడితే వాయిదా పడిన రెండు గంటల వ్యవధిలోనే మళ్ళీ గ్రామసభ నిర్వహిస్తారు. రెండవసారి కోరం లేకున్నా, ఎవరూ హాజరు కాకున్నా తీర్మానం ఆమోదం పొందినట్టు థృవీకరిస్తారు. ఈ రెండు నిబంధనలతో ఏజెన్సీ గ్రామసభలు పూర్తిగా అస్థిత్వం కోల్పోయినట్టే. 54 జీవోను కనీసం ప్రభుత్వ జీవోల వెబ్ సైట్లో కూడా పెట్టక పోగా వివిధ శాఖలకు, ఐటీడీఏలకు, పంచాయితీరాజ్ సంస్థలకు పంపలేదు.
జీవో చట్టబద్దతపై చర్చ…
అదివాసీల అభిప్రాయాలు తెలుసుకోకుండా పీసా చట్టం స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా జారీ చేసిన 54 జీవో చట్టబద్దతపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 2018 లో చట్టం 5 ద్వారా అమల్లోకి వచ్చిన కొత్త పంచాయితీరాజ్ చట్టంలో పీసా నిబంధనలను చేర్చినప్పటికీ ఈ చట్టం అమలు చేయడానికి పూర్తి స్థాయిలో విధివిధానాలను (గైడ్ లైన్స్) ఇప్పటి వరకూ రూపొందించలేదు. 1998 లో సవరించిన పంచాయితీరాజ్ చట్టం ప్రకారం పీసా నిబంధనలను జీవో 66 ద్వారా అమల్లోకి తెచ్చారు. కొత్త చట్టం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇదే జీవోను అమలు చేస్తున్నారు. కొత్త చట్టం అమల్లోకి రావడంతో పాత జీవో చెల్లదని వారంటున్నారు. ఇది చెల్లక పోతే ఈ జీవోలో కోరం కోసం సవరణలు చేస్తూ జారీ చేసిన కొత్త జీవో 54 మనుగడ కూడా ప్రశ్నార్థకం కానుంది. ఈ జీవోకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామని ఆదివాసీ సంఘాలు హెచ్చరస్తున్నాయి.